Studio18 News - ANDHRA PRADESH / : టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం ఘటనలో ఒక ప్రయాణికుడు దుర్మరణం రెండు కోచ్‌లను వేరు చేసి మంటలార్పిన సిబ్బంది ప్రమాద కారణాలపై రైల్వే శాఖ విచారణ టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే యలమంచిలి పోలీసులు, అగ్నిమాపక, రైల్వే, ఆర్‌పీఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించి సమన్వయంతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. వారి వృత్తి నైపుణ్యం వల్లే 150 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని అన్నారు. మంటలు వ్యాపించకుండా కోచ్‌లను వేరుచేయడం పెను ప్రమాదాన్ని నివారించిందని తెలిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోమవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఎక్స్‌ప్రెస్ (18189) రైలులోని రెండు ఏసీ కోచ్‌లలో (బీ1, బీ2) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బీ1 కోచ్‌లో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వ్యక్తి మృతి చెందారు. లోకో పైలట్లు మంటలను గమనించి వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గురైన రెండు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి, మిగతా రైలును సామర్లకోటకు పంపించారు. అక్కడి నుంచి ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం కారణంగా విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నాయి.
Admin
Studio18 News