Studio18 News - ఆరోగ్యం / : Acne | మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యలల్లో మొటిమలు కూడా ఒకటి. ముఖ్యంగా యువతలో మనం ఈ సమస్యను ఎక్కువగా చూడవచ్చు. మొటిమల వల్ల చర్మంపై మచ్చలు పడడంతో పాటు నొప్పి కూడా కలుగుతుంది. వీటి వల్ల ముఖ అందం తగ్గుతుందనే చెప్పవచ్చు. ముఖంపై వచ్చే ఈ మొటిమలను తగ్గించుకోవడానికి అనేక చిట్కాలను, ఆయింట్‌మెంట్ లను కూడా వాడుతూ ఉంటారు. హార్మోన్ల అసమతుల్యత, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యమే ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే మనలో కొందరు మాత్రం కాఫీ, చాక్లెట్, పాలు, పెరుగు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మాత్రమే మొటిమలు, మొండి మొటిమలు వంటివి వస్తాయని అంటూ ఉంటారు. అయితే ఇవి వాస్తవాలు కావని ఇవి అపోహలు మాత్రమే వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి, అపోహకి మధ్య స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది గందరగోళానికి గురవుతారని వైద్యులు తెలియజేస్తున్నారు. అసలు నిజంగా ఈ ఆహారాలు మొటిమలకు కారణమవుతాయా.. వీటి గురించి చర్మ వైద్యులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ మొటిమలను కలిగించదు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయనడం అపోహ మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు. మొటిమలకు కారణం డార్క్ చాక్లెట్ లో ఉండే కోకో కాదని దానిలో ఉండే చక్కెర అని, దీని వల్లనే చర్మంపై మొటిమలు వస్తాయని వారు తెలియజేస్తున్నారు. అలాగే మిల్క్ చాక్లెట్స్ లో ఉండే పాలు, చక్కెరలు రెండు కూడా చర్మం నూనెను ఎక్కువగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీంతో చర్మంపై మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా డార్క్ చాక్లెట్ చర్మానికి హానికరం కాదని దానిలో ఉండే చక్కెరలే మొటిమలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. వే ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్, ఐజిఎఫ్ – 1 స్థాయిలు పెరుగుతాయి. ఇవి రెండు కూడా మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలతో బాధపడే వారు వే ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల వారిలో మొటిమల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వే ప్రోటీన్ మంచిదే అయినప్పటికీ కండరాల పెరుగుదలకు, జిమ్ కి వెళ్లే వారికే ఇది సరైనదని వైద్యులు తెలియజేస్తున్నారు. పండ్ల రసాలు.. పండ్ల రసాలు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని చాలా మంది చక్కెరతో కలిపి తీసుకుంటారు. చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అధిక గ్లైసెమిక్ ఆహారాలు, చక్కెర తీసుకోవడం వల్ల చర్మం నూనెను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. చక్కెర లేని పండ్ల రసాలు చర్మానికి హానిని కలిగించవని వీటిని తీసుకోవడం వల్ల చర్మంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లను తీసుకోవడం వల్ల కూడా మొటిమలు రావని వైద్యులు చెబుతున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లను తీసుకోవడం వల్ల మాత్రమే మొటిమలు వస్తాయని వారు తెలియజేస్తున్నారు. పండ్లల్లో ఫైబర్ తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాఫీ.. కాఫీ కూడా మొటిమలకు కారణం కాదని వైద్యులు చెబుతున్నారు. కాఫీని పాలు, చక్కెర వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల మాత్రమే మొటిమలు వస్తాయని బ్లాక్ కాఫీ లేదా మొక్క ఆధారిత పాలతో చేసిన కాఫీని తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. పెరుగు పులియబెట్టిన ఆహారం. దీనికి శోథ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పెరుగును తీసుకోవడం వల్ల పొట్ట, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాల పదార్థాల అలర్జీ ఉన్న వారిలో మాత్రమే పెరుగును తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆహారాలు మన చర్మానికి హానిని కలిగించవని వాటిలో వాడే చక్కెర వంటి వాటితోనే మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మొటిమలతో బాధపడే వారు చక్కెరను, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని వారు సూచిస్తున్నారు.
Admin
Studio18 News