Studio18 News - క్రీడలు / : Amelia Kerr : మహిళల ప్రీమియర్ లీగ్ స్టార్ అమేలియా కేర్ (Amelia Kerr) ఫామ్ అందుకుంది. వన్డే ప్రపంచకప్‌లో తేలిపోయిన ఈ ఆల్‌రౌండర్ టీ20ల్లో విధ్వంసక సెంచరీతో కదం తొక్కింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో 59 బంతుల్లోనే శతకంతో మెరిసిందీ స్టార్ బ్యాటర్. పొట్టి ఫార్మాట్‌లో మొదటి శతకంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులను సంబురాల్లో ముంచెత్తింది. మరోవైపు టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న వైట్ ఫెర్న్ సైతం అమేలియా సెంచరీతో హ్యాపీగా ఉంది. స్వదేశంలో జరుగుతున్న విమెన్స్ సూపర్ స్మాష్(Women’s Super Smash)లో అమేలియా కేర్ చెలరేగింది. సోమవారం ఆక్లాండ్ హార్ట్స్ (Auckland Hearts) బౌలర్లకు చుక్కలు చూపెట్టిన కేర్ బౌండరీలతో విరుచుకుపడింది. 59 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తను పొట్టి క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేసింది. ఓపెనర్ జార్జియా పిమ్మర్(62)తో తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించగా వెల్లింగ్టన్ బ్లేజ్ (Wellington Blaze) జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం.. వెల్లింగ్టన్ బౌలర్ల విజృంభణతో ఆక్లాండ్ టీమ్ 135కే పరిమితమైంది. 49 పరుగుల తేడాతో గెలుపొందిన వెల్లింగ్టన్ బ్లేజ్ వరుసగా ఇది రెండో విజయం.
నిరుడు పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను గెలిపించిన ఘనత అమేలియాదే. తమ జట్టు ట్రోఫీ కలను సాకారం చేసిన తను పలు సందర్భాల్లో మ్యాచ్ విన్నర్‌గా నిరూపించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ అమేలియా నిలకడగా రాణిస్తోంది. ఈమధ్యే ముగిసిన నాలుగో సీజన్ వేలంలో కివీస్ ఆల్‌రౌండర్ భారీ ధర పలికింది. స్టార్ ఆల్‌రౌండర్‌ను రూ.3 కోట్లకు ముంబై ఇండియన్స్ తిరిగి తమ గూటికి చేర్చుకుంది. నాలుగో సీజన్ ముందు తను టచ్‌లోకి రావడంతో ముంబై ఫ్రాంచైజీ మురిసిపోతోంది.
Admin
Studio18 News