Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : 1985 నుంచి 2025 ఆగస్టు 31 వరకు కటాఫ్ 120 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి మురికివాడల ఇళ్లకు రుసుములో 50 శాతం రాయితీ ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలకు ఈ పథకం వర్తించదు ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు "భవనాల నియంత్రణ, శిక్షా విధాన నియమాలు – 2025 (బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ - BPS 2025)" పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ జీవో నంబర్ 225ను జారీ చేశారు. ఈ కొత్త పథకం ప్రకారం, 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 మధ్య కాలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను చట్టబద్ధం చేసుకోవచ్చు. ఇందుకోసం భవన యజమానులు 120 రోజుల గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా www.bps.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుతో పాటు భవన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫోటోలు, నిర్మాణ ప్లాన్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్, అఫిడవిట్ వంటి పత్రాలను జతచేయాలి. నివాస, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక భవనాలకు వేర్వేరుగా పెనాల్టీ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుసుము చెల్లించి తమ నిర్మాణాలను చట్టబద్ధం చేసుకోవచ్చు. 1997 సంవత్సరానికి ముందు నిర్మించిన భవనాలకు పెనాల్టీలో 25శాతం రాయితీ కల్పించారు. అదేవిధంగా, మురికివాడల్లో (స్లమ్ ప్రాంతాలు) ఉన్న ఇళ్లకు రుసుములో 50శాతం భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు, పార్కులు వంటి ప్రదేశాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు ఈ BPS పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వివాదాస్పద భూముల్లో ఉన్న కట్టడాలకు కూడా క్రమబద్ధీకరణ వర్తించదు. ఈ పథకం ద్వారా వసూలైన నిధులను పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, చెరువుల పరిరక్షణ వంటి పనులకు ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ అవకాశం కేవలం ఒక్కసారి మాత్రమేనని, అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ సూచించారు.
Admin
Studio18 News