Studio18 News - TELANGANA / WARANGAL : హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29 : జాతీయ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే 69వ అండర్-19 బాలికల జాతీయ క్రికెట్ పోటీలలో తెలంగాణ తరఫున జనవరి 1 నుంచి 6 వరకు మధ్యప్రదేశ్ రాష్ర్టం శివపురిలో జరిగే జాతీయస్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నీకి హనుమకొండ జిల్లా క్రీడా సమాఖ్య (డీఎస్ఏ)కు చెందిన సహస్రరాజ్ ఎంపికైంది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన రాష్ర్టస్థాయి అండర్-19 బాలికల క్రికెట్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున ఆడి ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ప్రస్తుతం సహస్రరాజ్ హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్)లో డీఎస్ఏ కోచ్ మహ్మద్ అఫ్టల్ పర్యవేక్షణలో క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. ఈ సందర్భంగా జాతీయస్థాయి క్రికెట్ టోర్నీకి ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ సహస్రరాజ్‌ను హనుమకొండ డీవైఎస్‌వో గుగులోతు అశోక్‌కుమార్, కోచ్ అఫ్జల్ అభినందించారు. వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న సహస్రరాజ్ గత సంవత్సరం తెలంగాణ తరఫున అండర్-17 బాలికల జాతీయ క్రికెట్ పోటీలలో హర్యానాలో పాల్గొంది. హెచ్‌సీఏ తరఫున అండర్-15, 19, 23 రాష్ర్ట పోటీలలో పాల్గొంది. ఇలాంటి మరిన్ని అవకాశాలను విజయాలను సాధించాలని డీవైఎస్వో అశోక్‌కుమార్, డీఎస్ఏ క్రికెట్ కోచ్ మహ్మద్ అఫ్టల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News