Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి పనుల వేగవంతానికి రూ.9,000 కోట్ల రుణ సేకరణకు ఆమోదం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1,500 కోట్ల సమీకరణ నాబ్‌ఫిడ్ నుంచి మరో రూ.7,500 కోట్ల భారీ రుణం ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇస్తూ ఉత్తర్వులు రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.9,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మౌలిక వసతుల కల్పనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, ఈ నిధులతో పనులకు కొత్త ఊపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్) ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను పూర్తిగా అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. ఈ రుణ ఒప్పందం, ఇతర అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి బాధ్యతలను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (నాబ్‌ఫిడ్) నుంచి మరో రూ.7,500 కోట్ల భారీ రుణం తీసుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను అమరావతిలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం, ల్యాండ్ పూలింగ్ పథకం, ఇతర మౌలిక వసతుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రుణ ఒప్పందం, హైపోథెకేషన్ డీడ్ వంటి అధికారిక ప్రక్రియలను పూర్తి చేసే అధికారాలను ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌తో పాటు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీలకు అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా నిర్ణయంతో రాజధానిలో మౌలిక వసతుల కల్పన పనులు ఇక శరవేగంగా ముందుకు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Admin
Studio18 News