Studio18 News - TELANGANA / HYDERABAD : ఆసుపత్రికి వెళ్లి కూడా కేసీఆర్‌ను కలిశానని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని వ్యాఖ్యలు సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని దిశానిర్దేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో తాను మాట్లాడిన విషయాలు మీకెలా చెబుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. శాసనసభ ప్రారంభం కాగానే రేవంత్ రెడ్డి, కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సభలో రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, కేసీఆర్‌ను ఈరోజే కాకుండా, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశానని గుర్తు చేశారు. అసెంబ్లీ నుంచి ఆయన వెంటనే ఎందుకు వెళ్లారో కేసీఆర్‌నే అడగాలని అన్నారు. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, తామిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతామని బదులిచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని అన్నారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని సూచించారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Admin
Studio18 News