Studio18 News - ఆరోగ్యం / : Yoga For Mental Health | మారిన జీవన విధానం కారణంగా తలెత్తుతున్న మానసికపరమైన సమస్యల్లో ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తోంది. మనదైనందిన జీవితంలో ఒత్తిడి ఒక భాగమైనదని చెప్పవచ్చు. దీర్ఘకాల ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడమే కాకుండా శరీర ఆరోగ్యం మొత్తం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీని వల్ల హృదయ స్పందనల రేటు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడితో ఎక్కువ కాలంగా బాధపడే వారిలో తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి, జీర్ణసమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించే మంచి మార్గాల్లో శారీరక వ్యాయామం ఒకటి. శారీరక వ్యాయామం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతను కలిగించే మంచి హార్మోనైన ఎండార్ఫిన్ విడుదల అవుతుంది. ఆందోళనను దూరం చేయడానికి, మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడంలో, నిద్రను మెరుగుపరచడంలో కూడా ఎండార్ఫిన్ హార్మోన్ మనకు సహాయపడుతుంది. అలాగే యోగా, ధ్యానం, ప్రాణాయామాలు చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచే కొన్ని యోగాసనాల గురించి యోగా నిపుణులు వివరిస్తున్నారు. గరుడాసనం.. ఇందులో చేతులు, కాళ్లను మెలితిప్పాలి. కండరాలు సాగడానికి, బలంగా తయారవ్వడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. శారీరక సమన్వయంతో పాటు దృష్టిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే ఈ ఆసనాన్ని వేయగలం. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. గరుడాసనం వేయడం వల్ల మెదడు ఉద్దీపన పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ ఆసనం మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బాలాసనం.. బాలాసనం నాడీవ్యవస్థకు ప్రశాంతతను చేకూరుస్తుంది. మనసుకు విశ్రాంతి లభిస్తుంది. బాలాసనం వల్ల ఆందోళన, మానసిక అలసట, భావోద్వేగ ఒత్తిడి వంటివి తగ్గుతాయి. ముందుకు వంగి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటుగా దృష్టి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అలాగే పద్మాసనం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. పద్మాసనం వేయడం వల్ల దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రత పెరగడం జరుగుతుంది. ఉత్థానాసనంలో ముందుకు వంగి, కాళ్లను నిటారుగా ఉంచి, తలను కిందికి ఉంచి ఆసనం వేయాలి. ఈ ఉత్తానాసనం నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. మెడ, భుజాలు, వీపులో ఉండే ఉద్రికత తగ్గుతుంది. మెదడుకు రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలు పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత మెరుగుపరచడానికి కూడా ఈ ఆసనం సహాయపడుతుంది. వజ్రాసనం.. శరీరాన్ని స్థిరీకరించడానికి, మనసు నిశ్చలతను ప్రోత్సహించడానికి వజ్రాసనం ఎంతో సహాయపడుతుంది. కాళ్లను మడిచి కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచి ఆసనం వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో వజ్రాసనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పొట్టపై పడుకుని కాళ్లు, చేతులను పైకి లేపి చేతులతో చీలమండలాలను పట్టుకుని ఛాతిని, తలను పైకి లేపి విల్లులాగా చేసే ఈ ఆసనం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజంగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్రిక్తతలు కూడా అదుపులో ఉంటాయి. పశ్చిమోత్థాసనం.. కాళ్లను ముందుకు చాచి, ముందుకు వంగి కాలి వేళ్లను పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక సాగుతుంది. ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు దృష్టి పెట్టడం కూడా పెరుగుతుంది. ఒత్తిడితో బాధపడే వారు రోజూ కొద్ది సమయం ఇలా ఆసనాలు వేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేసే పనిపై దృష్టి పెట్టడం, ఏకాగ్రత పెరగడం వంటివి కూడా జరుగుతాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది.
Admin
Studio18 News