Studio18 News - జాతీయం / : ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడ్డ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పుల్వామాలో నివసిస్తున్న తల్లితో సరిపోయిన డీఎన్ఏ సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన ఉగ్రవాది కదలికలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన కారు బాంబు దాడి కేసులో కీలక పురోగతి లభించింది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని దర్యాప్తు సంస్థలు అధికారికంగా నిర్ధారించాయి. కారులో లభించిన మృతదేహం అవశేషాలపై నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో ఈ విషయం స్పష్టమైంది. బుధవారం రాత్రి ఫోరెన్సిక్ బృందాలు ఈ నివేదికను పోలీసులకు అందించాయి. పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 కారు శిథిలాల నుంచి సేకరించిన ఎముకలు, దంతాలు, దుస్తుల నమూనాలతో... పుల్వామాలో నివసిస్తున్న ఉమర్ తల్లి, సోదరుడి డీఎన్ఏ నమూనాలు 100% సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉమర్ మొహమ్మద్ పేలుడుకు పాల్పడటానికి కొన్ని నిమిషాల ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదుకు వెళ్లినట్లు తేలింది. టర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదుకు వెళ్లి, అక్కడ 10 నిమిషాలకు పైగా గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయింది. నిజాముద్దీన్ మర్కజ్ తరహాలోనే ఈ మసీదులో కూడా తబ్లిగీ జమాత్ కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం. ఈ కొత్త సమాచారంతో అప్రమత్తమైన దర్యాప్తు బృందాలు ప్రస్తుతం ఆ మసీదుపై నిఘా పెట్టాయి. ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసే వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ఉమర్ కీలక సభ్యుడని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. దాడికి ఉపయోగించిన తెల్లటి ఐ20 కారును అతడే 11 రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. తాజాగా డీఎన్ఏ నివేదికతో ఉమరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో, ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Admin
Studio18 News