Studio18 News - జాతీయం / : హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైరింజన్లు వాహనాలను దారి మళ్లించి క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బస్ టైర్ పేలడంతోనే శబ్దం వచ్చిందని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం ఢిల్లీలోని రాడిసన్ హోటల్ వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దీంతో మరో పేలుడు జరిగిందని జనం వణికిపోయారు. ఓ మహిళ ఫోన్ చేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. వాహనాల రాకపోకలను దారిమళ్లించి ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశోధించగా.. బస్ టైర్ పేలడం వల్లే భారీ శబ్దం వచ్చిందని తేలింది. దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఓ మహిళ ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసింది. తాను గురుగ్రామ్ వెళుతుండగా మహిపాల్ పూర్ ఏరియాలోని రాడిసన్ హోటల్ సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని తెలిపింది. దీంతో తమ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అక్కడ ఎలాంటి అనుమానాస్పద ఘటన జరిగినట్లు కనిపించలేదని చెప్పారు. స్థానికులను, వాహనదారులను ఆరా తీయగా ఓ గార్డు అసలు విషయం వెల్లడించాడని తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన ఓ బస్సు ఆ మార్గంలో వెళుతుండగా వెనక టైరు పేలిపోయిందని, దీంతో భారీ శబ్దం వచ్చిందని చెప్పాడన్నారు. అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పేలుడు జరగలేదని నిర్ధారించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Admin
Studio18 News