Studio18 News - జాతీయం / : విధానాల అమలుకు రెండు నెలల తుది గడువు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు విధానాల అమలును పర్యవేక్షించనున్న హైకోర్టులు కేరళకు చట్ట సవరణ కోసం నాలుగు నెలల గడువు ఖైదీ అర్హతకు 6 నెలల ముందే కేసు సమీక్షించాలని సూచన ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు నెలల్లోగా ఈ విధానాలను సంపూర్ణంగా అమలు చేయాలని గురువారం గడువు విధించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం.. బెయిల్, రెమిషన్ విధానాలకు సంబంధించిన సమస్యలపై సుమోటోగా విచారణ చేపట్టిన 'ఇన్ రీ: పాలసీ స్ట్రాటజీ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్' కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది. లిజ్ మాథ్యూ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ ఐదు రాష్ట్రాలు తమ ముందస్తు విడుదల విధానాలను, నిబంధనలను ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తూ, "చివరి అవకాశంగా, ఈ ఐదు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించేందుకు ఈ ఉత్తర్వుల తేదీ నుంచి రెండు నెలల సమయం ఇస్తున్నాం" అని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేరళ పాక్షికంగానే నిబంధనలు అమలు చేసిందని పేర్కొన్న కోర్టు, ముందస్తు విడుదల అభ్యర్థనలను తిరస్కరించినప్పుడు కారణాలను తప్పనిసరిగా వెల్లడించేలా చట్టపరమైన సవరణ చేసేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలకమైన సూచన చేసింది. ఒక ఖైదీ ముందస్తు విడుదలకు అర్హత సాధించడానికి కనీసం ఆరు నెలల ముందే అతని కేసును రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాలని ఆదేశించింది. దీనివల్ల అర్హత పొందిన తర్వాత కూడా ఖైదీలు అనవసరంగా జైలులో గడపాల్సిన పరిస్థితిని నివారించవచ్చని అభిప్రాయపడింది. ఈ కేసులో మరో ముఖ్యమైన ఆదేశాన్ని సుప్రీంకోర్టు జారీ చేసింది. రెమిషన్ విధానాల అమలు పురోగతిని ఆయా రాష్ట్రాల హైకోర్టులు పర్యవేక్షించాలన్న లిజ్ మాథ్యూ సూచనను అంగీకరించింది. "సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సుమోటోగా రిట్ పిటిషన్ నమోదు చేసి, ఆ తర్వాత ఒక డివిజన్ బెంచ్‌ను ఏర్పాటు చేసి రెమిషన్, ముందస్తు విడుదల విధానాల అమలును పర్యవేక్షించాలి" అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Admin
Studio18 News