Studio18 News - అంతర్జాతీయం / : కొత్తగా నిర్మించిన బ్రిడ్జికి ఇటీవల పగుళ్లు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపేసిన అధికారులు మంగళవారం ఉన్నట్టుండి బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయిన వైనం చైనాలో ఇటీవలే ప్రారంభించిన కొత్త బ్రిడ్జి ఒకటి పాక్షికంగా కూలిపోయింది. రెండు కొండల మధ్య ఉన్న నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి మంగళవారం ఒకవైపు కూలింది. అయితే, బ్రిడ్జికి పగుళ్లు రావడం గమనించిన అధికారులు సోమవారం నుంచే వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. బ్రిడ్జి కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిచువాన్ ప్రావిన్స్ లో సెంట్రల్ చైనాను, టిబెట్ తో కలిపే హైవేలో భాగంగా 758 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండు కొండలను అనుసంధానిస్తూ నిర్మించిన ఈ బ్రిడ్జిని హాంగ్ కీ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో భారీ కాంక్రీట్ దిమ్మలు కింద పారుతున్న నదిలో పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతాన్ని దుమ్ము కమ్మేయడం వీడియోలో కనిపిస్తోంది. నిర్మాణ డిజైన్ లోని లోపాల వల్లే బ్రిడ్జి కూలిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బ్రిడ్జి కూలడానికి కారణమేంటనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Admin
Studio18 News