Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలన్న కాజోల్ సెలబ్రిటీ టాక్ షోలో వివాహంపై ఆసక్తికర చర్చ కాజోల్ అభిప్రాయంతో విక్కీ కౌశల్, కృతి సనన్ విభేదం సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పెళ్లికి కూడా ఓ ‘ఎక్స్‌పైరీ డేట్’ (గడువు తేదీ), ‘రెన్యువల్ ఆప్షన్’ (పునరుద్ధరణ అవకాశం) ఉండాలని ఆమె పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ ‘వద్దు’ అని చెబుతూ రెడ్ జోన్‌లో నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ జోన్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంటనే ట్వింకిల్ ఖన్నా సరదాగా “అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, “నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు. అదే షోలో “డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?” అనే మరో ప్రశ్న రాగా... కాజోల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం” అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో ట్వింకిల్ సరదాగా “బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి మాజీలతో డేటింగ్ చేయకూడదు” అని కాజోల్‌ను ఆటపట్టించగా, ఆమె నవ్వుతూ “నోరు మూయ్!” అంటూ స్నేహపూర్వకంగా హెచ్చరించారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ఈ షోకు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అలియా భట్ వంటి ప్రముఖులు రాబోయే ఎపిసోడ్‌లలో పాల్గొననున్నారు.
Admin
Studio18 News